: దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులనే దోచుకున్న ఆగ్రా వాసులు!


లూటీ చేసేందుకు వచ్చిన వారే లూటీకి గురయ్యారని తెలుసుకున్న పోలీసులు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఆగ్రా సమీపంలోని ఖుల్లువా గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పోలీసు కంట్రోల్ రూంలో మోగిన ఫోన్ ఎత్తిన అధికారికి, ఇద్దరు దొంగలను తాము పట్టుకున్నామని ఓ వ్యక్తి చెప్పాడు. పోలీసులు వెళ్లి, వారిని అదుపులోకి తీసుకుని, వారిద్దరిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న నేత్రపాల్ సింగ్ ఉన్నాడని గుర్తించి సంబరపడ్డారు. గ్రామ వాసులను పొగిడి మరీ, దుండగులను స్టేషనుకు తీసుకువచ్చారు. ఆపై విచారణలో వారు చెప్పినది విని విస్తుపోయారు. తాము దొంగతనానికి వచ్చిన మాట నిజమే అయినా, గ్రామస్థులు తమను దోచుకున్నారని, పోలీసులకు ఫోన్ చేసే ముందు తమ వద్ద ఉన్న డబ్బు, ఆయుధాలను ఎత్తుకెళ్లారని వారు చెప్పారు. అంతకుముందు వీరిద్దరూ విజయ్ సింగ్ అనే వ్యక్తిని అటకాయించి అతన్ని దోపిడీ చేసి బైక్ పై పారిపోతూ అదుపుతప్పి కిందపడి ప్రజలకు చిక్కారట. ఆపై వీరిద్దరినీ కాసేపు చావగొట్టి, డబ్బు లాక్కున్నాక, పోలీసులు వచ్చేంత వరకూ ఓ చెట్టుకింద మంచమేసి మరీ, పడుకుని విశ్రాంతి తీసుకునేందుకు గ్రామస్థులు అనుమతించారట కూడా. వారి నుంచి దోచుకున్న డబ్బు, ఆయుధాలను రికవరీ చేసుకునేందుకు వెళ్లిన పోలీసులకు తొలుత చుక్కెదురైంది. ఆపై గట్టిగా అడగడంతో రూ. 49 వేలు, ఓ రివాల్వర్ తెచ్చిచ్చారట. మరో రెండు రివాల్వర్లు గ్రామస్థుల వద్ద ఉన్నాయని, వాటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News