: మోదీ, ఒబామాల స్నేహం నిజం: రిచర్డ్ వర్మ
భారత్, అమెరికా దేశాల మధ్య సహాయం ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరని, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య ఓ నిజమైన, బలమైన స్నేహబంధముందని భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ వ్యాఖ్యానించారు. వాతావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ లక్ష్యాన్ని సాధించేందుకు అమెరికా, యూఎస్ లు కలిసి పనిచేయడాన్ని ఇప్పుడు చూస్తున్నామని, కానీ, ఇద్దరు నేతల మధ్యా ఈ విషయమై ఏడాది క్రితం నుంచే చర్చలు జరిగాయని ఆయన అన్నారు. ఇండియాలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న 30 కోట్ల మందికి చౌకగా విద్యుత్ ను అందించేందుకు అమెరికా సాయపడుతుందని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రస్తుతానికి ప్రపంచం రెండుగా విడిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ, అది తాత్కాలికమేనని వర్మ అభిప్రాయపడ్డారు. 2015లో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయని, మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండు సార్లు అమెరికాలో పర్యటించారని ఆయన గుర్తు చేశారు. ఇరు దేశాల నేతలకూ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసునని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్న విషయంలో కచ్చితమైన లక్ష్యాలున్నాయని అన్నారు.