: పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన జైట్లీ అంశం
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో అక్రమాలు జరిగాయన్న అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. సభలు ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. డీడీసీఏ కుంభకోణంలో పాత్రధారి అయిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని విపక్ష నేతలు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై చర్చించలేమని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ చెప్పడంతో... విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలో కూడా ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తిరస్కరించారు. దీంతో, విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉభయసభలూ అరగంట పాటు వాయిదా పడ్డాయి.