: బతుకు గడిచేందుకు టీ అమ్ముకుంటున్న ఇంటర్నేషనల్ కరాటే ప్లేయర్ వందన
ఆమె పేరు వందనా సూర్యవంశి, ఒకప్పుడు కరాటే చాంపియన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మార్లు భారత కీర్తి పతాకను ఎగురవేశారు. ఆమె వద్ద శిక్షణ తీసుకున్న ఎంతో మంది జాతీయ స్థాయిలో రాణించారు, రాణిస్తున్నారు కూడా. ఖాట్మండులో 2014లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు. కానీ, ఇప్పుడు జీవనం గడిచేందుకు ఆదాయం లేక రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్నారు. వందన కథను ఓ న్యూస్ ఏజన్సీ వెలుగులోకి తెచ్చింది. "నేను కరాటే చాంపియన్ ను. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ప్రభుత్వాలు నా వంటి వారిని మరచిపోయాయి. ఇల్లు గడిచేందుకు పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తూ, టీ అమ్ముతున్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నా" అని అన్నారు. చిన్నప్పటి నుంచి కరాటే చాంపియన్ ను కావాలన్నది తన కోరికని, దాన్ని తీర్చుకున్నా, ఆర్థికంగా నిలదొక్కుకోలేదని అన్నారు. తనకేదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే కరాటే ప్లేయర్లలో నమ్మకం పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు వందన. మరి ప్రభుత్వం స్పందిస్తుందో? లేదో?