: అందాల పోటీల్లో నాలిక్కరుచుకున్న జడ్జి...విజేతగా కొలంబియా భామను ప్రకటించి సారీ చెప్పిన వైనం
లాస్ వెగాస్ లో నేటి ఉదయం ముగిసిన మిస్ యూనివర్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అమెరికా కమెడియన్ స్టీవ్ హార్వే ఘోర తప్పిదం చేశాడు. పోటీల్లో సత్తా చాటి విజేతగా నిలిచిన ఫిలిప్పీన్స్ భామ పియా అలోంజో వుర్త్జ్ బాచ్ కు బదులు కొలంబియా సుందరి అరియాడ్నా గుటియరెజ్ విజయం సాధించినట్లు ప్రకటించేశాడు. దీంతో మాజీ మిస్ యూనివర్స్ పాలినా వెగా, గుటియరెజ్ కు శుభాకాంక్షలు తెలపడమే కాక కిరీటాన్ని కూడా ఆమెకు అందించింది. అయితే జరిగిన పొరపాటును వెనువెంటనే గుర్తించిన స్టీవ్ హార్వే విజేతగా నిలిచిన భామ అలోంజో అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. విజేత పేరును తాను తప్పుగా చదివానని, తనను క్షమించమని అతడు వేడుకున్నాడు. దీంతో తాను గుటియరెజ్ తలకు అలంకరించిన కిరీటాన్ని పాలినా వెగా తానే తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే కిరీటాన్ని వాస్తవ విజేతగా నిలిచిన అలోంజో శిరస్సుపై అలంకరించింది.