: టెక్కీలంతా స్వార్థపరులే... ఇండియాపై ఎవరికీ ప్రేమ లేదు: కట్జూ సంచలన వ్యాఖ్యలు
ఐఐటీల్లో చదువుకుని బయటకు వస్తున్న వారంతా స్వార్థపరులేనని, వారెవరికీ ఇండియాపై నిజమైన ప్రేమ ఉన్నట్టుగా తనకు కనిపించడం లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ బాంబేలో విద్యార్థులతో సమావేశమైన ఆయన, ఐఐటీయన్లు తమ ప్రయోజనాలకు పాకులాడుతున్నరే తప్ప, వారిలో దేశభక్తి కొరవడిందని, దేశ అభివృద్ధి ఆలోచనలు లేవని అన్నారు. ఇండియాలోని ప్రముఖ ఐఐటీ గా ఉన్న బాంబే ఐఐటీలోకి గెస్ట్ స్పీకర్ గా వచ్చిన కట్జూ, ఎవరూ ఊహించని విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. ఇండియాలో చదివి, ఆపై అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుని, అనంతరం ప్రవాస భారతీయులుగా మారిపోతూ దేశానికి అన్యాయం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది దేశానికి, దేశ ప్రజలకు మంచిది కాదని అన్నారు. ఐఐటియన్లంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతో, సబ్సిడీపై విద్యను అభ్యసిస్తున్నారని, ప్రతి భారతీయుడూ విద్యార్థుల ఐఐటీ విద్యకు డబ్బిస్తున్నాడన్న విషయాన్ని వీరు మరచి, తమకు లభించిన విజ్ఞాన ఫలాలను అమెరికాకు పంచుతున్నారని కట్జూ ఆరోపించారు. ఇక కట్జూ వ్యాఖ్యలపై టెక్ విద్యార్థిలోకం ఎలా స్పందిస్తుందో!