: అలాంటి వరద రెట్టింపు వచ్చినా మన అమరావతి సేఫ్!: మంత్రి నారాయణ
తమిళనాడు రాజధాని చెన్నైని వరద పోటెత్తిన నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో కురిసిన స్థాయి వర్షం కురిస్తే, అమరావతి కూడా నీట మునగడం ఖాయమని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై నిన్న ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సీఆర్డీఏ అధికారులతో సమావేశం తర్వాత మీడియాలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైని పోటెత్తిన వరద స్థాయి 16 వేల క్యూసెక్కులేనని నారాయణ పేర్కొన్నారు. దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో 25 వేల క్యూసెక్కుల స్థాయి వరద పోటెత్తినా, అమరావతికి లేశమాత్రం నష్టం కూడా జరగదని స్పష్టం చేశారు. అయినా కేవీపీ చెబుతున్నట్లుగా చెన్నైని వరద ముంచెత్తడానికి అక్కడి దురాక్రమణలే కారణమని నారాయణ తేల్చిచెప్పారు. అమరావతిలో ఆ తరహా దురాక్రమణలు జరిగే అవకాశమే ఇవ్వబోమన్నారు. ఊహాజనిత కారణాలు చూపుతూ కేవీపీ అమరావతిపై కపట ప్రేమ చూపుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.