: ‘బీప్ సాంగ్’పై ప్రశ్నించిన పాత్రికేయుడిపై ఇళయరాజా మండిపాటు!
‘బీప్ సాంగ్’పై మీ అభిప్రాయమేంటి? అని అడిగిన ఒక టీవీ ఛానల్ పాత్రికేయుడిపై మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా మండిపడ్డారు. ‘నీకు బుద్ధి ఉందా?’ అంటూ ఆ పాత్రికేయుడిపై ఆయన దురుసుగా మాట్లాడారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఈ సంఘటనపై పాత్రికేయులు మండిపడుతున్నారు. చెన్నై వరద బాధితుల సహాయార్థం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఇళయరాజాను ఒక టీవీ ఛానల్ కు చెందిన పాత్రికేయుడు ఈ ప్రశ్నవేశాడు. ఆ సమయంలో సుమారు వంద మంది వరకు పాత్రికేయులు ఉన్నారని, వారి మధ్యలో సదరు పాత్రికేయుడిపై ఈవిధంగా మాట్లాడటం ఇళయరాజాకు తగదంటూ పాత్రికేయ సంఘాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై ఇళయరాజా సోదరుడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. బీప్ సాంగ్ గురించి అనిరుధ్ బంధువైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని విలేకరులు ప్రశ్నించవచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. సదరు విలేకరిపై మండిపడ్డ ఇళయరాజా గురించి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా మాట్లాడుతూ, పెద్ద వయస్సులో ఉన్న తన తండ్రి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వరద బాధిత సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ సమయంలో విలేకరి ఇటువంటి ప్రశ్న అడగడం ఆయనకు కోపాన్ని తెప్పించిందని.. వేరే కారణాలేవీ లేవని అన్నారు. ఈ సమస్యను ఇంతటితో వదిలివేయాలని కార్తీక్ రాజా కోరారు.