: కొత్త కస్టమర్లకు కాల్ రేట్లను 80 శాతం తగ్గించిన బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ మాధ్యమంగా కొత్త కనెక్షన్లు తీసుకునే కస్టమర్లకు కాల్ రేట్లను 80 శాతం తగ్గిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇతర టెల్కోల నుంచి వచ్చే పోటీని తట్టుకుంటూ, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తొలి రెండు నెలలూ ఈ ఆఫర్లను అందిస్తున్నట్టు సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. కొత్త కనెక్షన్ కోసం వచ్చే వారు రూ. 37 వోచర్ తో రీచార్చ్ చేసుకుంటే, నిమిషానికి పది పైసల బిల్లింగ్ అమలవుతుందని ఆయన అన్నారు. లోకల్, ఎస్టీడీ కాల్స్ పై బీఎస్ఎన్ఎల్ మినహా మిగతా నెట్ వర్క్ లకు ఫోన్ చేస్తే, నిమిషానికి 30 పైసల వంతున వసూలు చేస్తామని తెలిపారు. సెకను ప్లాన్ లో భాగంగా రూ. 36తో రీచార్జ్ చేసుకుంటే మూడు సెకన్లకు పైసా వసూలు చేస్తామని, ఏ ప్లాన్ లోనైనా ఇతర నెట్ వర్కులతో పోలిస్తే, 80 శాతం వరకూ రాయితీ లభిస్తుందని వివరించారు.