: భార్య స్థానం ఎంత గొప్పదో రంగనాథ్ నిరూపించారు: పరుచూరి
భార్య దూరమైన కారణంగానే మనస్తాపానికి గురైన సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రంగనాథ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, లేత వయసులో తొందరపాటు నిర్ణయంతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడవచ్చుగానీ, 60 సంవత్సరాలు దాటిన తరువాత, నలుగురికీ మార్గదర్శకంగా నిలవాల్సిన రంగనాథ్, ఇలా తనువు చాలించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భార్యా వియోగం, మిగతా వియోగాలకన్నా భయంకరమైనదని, దాన్ని ఆరేళ్లు రంగనాథ్ అనుభవించారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కూడా అమ్మ చనిపోయిన తరువాత 52వ రోజున చనిపోయారని, భార్య స్థానం ఎంతగొప్పదో, ఆమెను పోగొట్టుకున్న పురుషులకే తెలుస్తుందని వివరించారు. రంగనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.