: చిట్టీల పేరిట రూ. 50 లక్షలు ఎగ్గొట్టి, బాధితులపైనే కేసు పెట్టిన ఘనుడు!
పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ నమ్మకస్తుడిగా పేరు గడించి, ఆపై 25 మందికి రూ. 50 లక్షల వరకూ ఎగ్గొట్టి వారిపైనే కేసు పెట్టాడో ఘనుడు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హయత్ నగర్ పరిధిలోని పద్మావతి కాలనీలో అంజిరెడ్డి అనే వ్యక్తి చిట్టీల వ్యాపారి. గత కొంత కాలంగా చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులను చెల్లించకుండా కాలం సాగదీస్తూ వచ్చాడు. బాధితులంతా కలిసి అంజిరెడ్డి ఇంటికి వెళ్లి నిలదీయగా, చిట్టీల వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పాడు. దీంతో వారంతా పోలీసు కేసు పెట్టగా, డబ్బుల కోసం వచ్చిన వ్యక్తులు తమపై దాడిచేసి కొట్టారని అంజిరెడ్డి ఎదురు ఫిర్యాదు చేశాడు. దీంతో రెండు కేసులనూ నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.