: ఇలా ఎందుకు జరిగిందో?... నాన్న ఆత్మహత్యను జీర్ణించుకోలేకున్నా: రంగనాథ్ కుమార్తె
తమ తండ్రి ఆత్మహత్య చేసుకుంటారని ఎంతమాత్రమూ ఊహించలేదని సీనియర్ నటుడు రంగనాథ్ కుమార్తె శైలజ కన్నీటిపర్యంతం అయ్యారు. నిన్న ఉరివేసుకుని మరణించిన రంగనాథ్ భౌతిక కాయానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుండగా, ఇద్దరు కుమార్తెలు నీరజ, శైలజ, కుమారుడు నాగేంద్ర అక్కడే ఉన్నారు. శైలజ మాట్లాడుతూ, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని, ఆయనో రోల్ మోడల్ గా నిలిచారని, ఎంతో మనో నిబ్బరాన్ని చూపే ఆయన మరణాన్ని తాను జీర్ణించుకోలేకున్నానని అన్నారు. తమతో ఉండాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ, అంగీకరించలేదని తెలిపారు. ఆయన ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవారని, అందువల్లే తాము కూడా దూరంగా ఉంటూ వచ్చామని వివరించారు. కాగా, రంగనాథ్ మృతదేహాన్ని హైదరాబాదు, జూబ్లీహిల్స్ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి మధ్యాహ్నం తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని సినీ వర్గాలు వెల్లడించాయి. ఆపై సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని రంగనాథ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.