: తిరుమలలో చిత్రమైన పరిస్థితి... భక్తులు కిటకిట, దర్శనానికి మాత్రం వెళ్లట్లేదు!


ఏడు కొండల వెంకన్న కొలువైన తిరుమలలో ఈ ఉదయం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల గిరులు భక్తులతో నిండిపోతుండగా, సర్వదర్శనానికి వెళ్లే క్యూలైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. దర్శనానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతున్నప్పటికీ, భక్తులు క్యూలోకి వెళ్లని స్థితి. కొండపైకి వస్తున్న ప్రతి బస్సు పూర్తి ప్రయాణికులతో నడుస్తున్నాయి. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఆ సమయంలో స్వామి వారిని దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే తిరుమలలోని విశ్రాంతి గదులన్నీ నిండిపోయాయి. సిఫార్సు లేఖలపై గదుల కేటాయింపును నిలిపివేసిన టీటీడీ, వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే వారికి అతిథి గృహాలను కేటాయిస్తోంది. రేపటి వైకుంఠ దర్శనానికి నేటి ఉదయం 10 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈఓ సాంబశివరావు ప్రకటించగా, ఉదయం 8 గంటల నుంచి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ముందు వేలాదిగా చేరడంతో, భద్రతా సిబ్బంది వారిని అదుపు చేస్తున్నారు. కాగా, నేటి దర్శనం కోసం రెండు కంపార్టు మెంట్లలో భక్తులు వేచి వున్నారు. నేడు సర్వదర్శనానికి వెళ్లే భక్తులను కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి పంపుతామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News