: అమెరికా బయలుదేరిన విద్యార్థులను నిలువరించిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు
అమెరికాలో నిషేధానికి గురైన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించేందుకు పయనమైన 20 మంది విద్యార్థులను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు నిలిపివేశారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్ పాలిటెక్నిక్ యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన వీరు స్టడీ వీసాలతో బయలుదేరగా, అప్పటికే ఈ వర్శిటీల నిషేధంపై సమాచారం అందుకున్న ఇమిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేశారు. తమకు జనవరి 4 నుంచి క్లాసులు ఉన్నాయని విద్యార్థులు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తమ భవిష్యత్ విద్యపై వీరంతా ఆందోళనతో ఉన్నారు. ఇదే వర్శిటీల్లో ప్రవేశం పొంది, అమెరికాకు చేరిన పలువురు విద్యార్థులు ఇప్పుడు వెనక్కు రాక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. కాగా, గతంలో ట్రైవ్యాలీ యూనివర్శిటీ విషయంలో కూడా ఇదే విధంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వర్శిటీపై నిషేధం పడటంతో, వందలాది మంది భారత విద్యార్థినీ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.