: ఆమె వండితే ఊరివాళ్లు తినమన్నారు...కలెక్టర్ తిన్నారు!


బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో కల్యాణ్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన మధ్యాహ్న భోజన పథకంలో ఆహారాన్ని ఓ వితంతువు తయారుచేస్తోందన్న కారణంతో, భోజనం చేస్తున్న తమ పిల్లలను పెద్దలు మధ్యలోనే లాక్కెళ్లిన ఘటన మంగళవారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బుధవారం స్కూలు కూడా మూసేశారు. దీంతో ఆ మహిళ గురువారం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ శుక్రవారం డీఈవోను తీసుకుని కల్యాణ్ పూర్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో విద్యార్థులతో సమానంగా కింద కూర్చుని గ్రామస్థులు ఏ మహిళ వండితే తినమని భీష్మించుకుని కూర్చున్నారో, ఆ మహిళ చేతితో తయారు చేసిన భోజనాన్ని డీఈవో, ఉపాధ్యాయులు, కలెక్టర్ కలిసి ఆరగించారు. మూఢ నమ్మకాలతో ఇలాంటి ఆందోళనలు చేయవద్దని ఆయన గ్రామస్థులకు నచ్చజెప్పారు. కాగా, ఆ మహిళకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండగా, ఆమె నెల రోజుల పాటు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడితే వెయ్యి రూపాయల వేతనం లభిస్తుంది.

  • Loading...

More Telugu News