: టీమిండియాలోకి వచ్చిన యువరాజ్!
వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత జట్టులో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీట్వంటీలు ఆడనున్న ఆటగాళ్లను సెలెక్టర్లు ప్రకటించారు. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే, టీట్వంటీల్లో పేలవ ప్రదర్శనతో తోక ముడిచిన టీమిండియా ఆటగాళ్లకు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. టీట్వంటీ జట్టులోకి యువరాజ్ సింగ్, పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేసిన సెలెక్టర్లు, వన్డే జట్టుకు రవీంద్ర జడేజా, మహ్మద్ షమిలను ఎంపిక చేశారు. వన్డే జట్టులో గురుకీరత్ సింగ్ తన స్థానం పదిలం చేసుకోగా, ఆల్ రౌండర్ రిషి ధావన్, పంజాబ్ ఆటగాడు బ్రయిందర్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. వన్డేల్లో సురేష్ రైనా చోటు కోల్పోవడం విశేషం. కాగా, సుదీర్ఘ విరామం తరువాత యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా జట్టుపై యువరాజ్ సింగ్ కు మంచి ట్రాక్ రికార్డు ఉండడం, పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో యువీ కీలకం కాగలడని, అతడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనితో పాటు 2016 టీట్వంటీ ప్రపంచ కప్ కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు.