: పాప్ గాయకుడు రెమో ఫెర్నాండేజ్ పై గోవాలో కేసు
'బొంబాయి' చిత్రంలో 'అది అరబిక్ కడలందం...' పాట ఎంత పాప్యులరో అందరికీ తెలుసు. ఆ పాట పాడిన ప్రముఖ పాప్ గాయకుడు రెమో ఫెర్నాండేజ్ (62)పై తాజాగా గోవాలో కేసు నమోదైంది. తన కొడుకు జొనాద్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఓ బాలికను బెదిరించాడని, ఆమెను భయపెట్టి, దుర్భాషలాడాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి జివ్బా దాల్వి తెలిపారు. ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేశాక రెమోకు అరెస్టు వారెంట్ జారీ చేస్తామని చెప్పారు. ఈ నెల 2న జొనాద్ నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేస్తుండగా ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక గోవాలోని మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారకుడయ్యాడంటూ జొనాద్ పై మపుసా పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న రెమో ఆసుపత్రికి వెళ్లి ఆ అమ్మాయిని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ యూరప్ పర్యటనలో ఉన్న రెమో ఖండిస్తున్నాడు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేస్తానంటున్నాడు.