: ఉత్కంఠకు తెరదించిన న్యాయస్థానం!


గత వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ఆందోళనలు, నేటి ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా నెలకొన్న నిరసనలకు ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్ధానం తెరదించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల కేసులో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరినీ విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. దీంతో నేటి ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కాంగీయులు బీజేపీపై నిప్పులు చెరిగారు. విమర్శలు, ఆందోళనలు, నిరసనలతో దేశాన్ని హోరెత్తించారు. వీరి హాజరుపై మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించింది. అరెస్టులు జరుగుతాయా? జరగవా? అరెస్టులు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించనుంది? అంటూ ప్రసారసాధనాల్లో హోరెత్తించారు. దీంతో రావాల్సిన సమయం రానే వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా న్యాయస్థానం వద్ద 16 సీసీ కెమెరాలు అమర్చిన అధికారులు, న్యాయస్థానం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పటియాలా హౌస్ న్యాయస్థానం ముందు సోనియా, రాహుల్ హాజరయ్యారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు అప్పగించాలని కోర్టులో సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. నిందితుల తరపు కపిల్ సిబాల్ వాదనలు విన్న న్యాయస్థానం వ్యక్తిగత పూచీకత్తుతో వారికి బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్ధానంలో ప్రవేశించి, బయటకు వచ్చేందుకు వారికి 20 నిమిషాలు పట్టగా, విచారణ కేవలం 5 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో నేటి ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ దూదిపింజలా ఎగిరిపోయింది.

  • Loading...

More Telugu News