: భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడొద్దు... పాక్ మంత్రులకు ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశం
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యవహార సరళిలో మార్పు వచ్చింది. గతంలో భారత్ అంటేనే అంతెత్తున ఎగిరిపడిన నవాజ్ షరీఫ్, ఇటీవల ప్యారిస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆత్మీయ భేటీ తర్వాత శాంత స్వభావిగా మారిపోయారు. ఇరువురు నేతల మధ్య భేటీ తర్వాత భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. అంతకుముందే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన చర్చల ప్రక్రియ మళ్లీ పున:ప్రారంభమయ్యేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని షరీఫ్ తన కేబినెట్ మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నవాజ్ సన్నిహితుడొకరు నిన్న పాక్ మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు.