: తమిళనాడు వరద బాధితులకు విద్యుత్ బిల్లు చెల్లింపులో వెసులుబాటు
భారీ వర్షాలు, వరదలతో ఆధారం కోల్పోయిన తమిళనాడు వరద బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులో డిస్కౌంట్ కల్పిస్తోంది. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో విద్యుత్ మీటర్ రీడింగ్ నమోదు చేయనట్టయితే సంబంధిత వినియోగదారులు గత నెలలో చెల్లించిన విద్యుత్ బిల్లులో సగం ఈ నెల చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర విద్యుత్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కాలనీల్లో వర్షపు నీరు నిలిచి ఉందని, విద్యుత్ ఉద్యోగులు సదరు ప్రాంతాల్లో మీటర్ రీడింగ్ తీసే పరిస్థితి లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బిల్లు చెల్లింపులో వెసులు బాటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అంతేగాక విద్యుత్ వినియోగదారులు ఈ నెల బిల్లు చెల్లించడానికి గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఇంతకుముందే ప్రకటించామని తెలిపింది. చెన్నై, కంచి, తిరువల్లూరు, కడలూరు జిల్లాల్లో కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.