: రోజా ‘బుల్లెట్’ వ్యాఖ్యలను ప్రస్తావించిన అచ్చెన్న... వినకుంటే మిగతా వారికీ రోజా గతేనని వార్నింగ్
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పై నేటి అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఏడాది పాటు సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేయగా, కోర్టులు కూడా అసెంబ్లీ నిర్ణయాలను ప్రశ్నించజాలవని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పారు. ఈ సమయంలో కలుగజేసుకున్న టీడీపీ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సభలో రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సభలో సీనియర్లు, జూనియర్లు ఉండరని చెప్పిన రోజా ‘బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ముఖ్యం’ అని వ్యాఖ్యానించారని అచ్చెన్న పేర్కొన్నారు. సభా నియమాలు తెలుసుకోవాలన్న సూచన చేస్తేనే అంతెత్తున ఎగిరిపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అంతేకాక సభాధ్యక్ష స్థానాన్ని రోజా టార్గెట్ చేశారన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉన్న తమ పార్టీ సభ్యుడు కరణం బలరాంను స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేసిన విషయాన్ని మరిచిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. సభా నియమాలను గౌరవించకుంటే రోజాకు పట్టిన గతే మిగిలిన విపక్ష సభ్యులకు తప్పదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.