: షహర్ హమారా... హైదరాబాదు హమారా!: గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ నినాదమిదే!
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. వచ్చే నెలాఖరులోగా ఎన్నికలు జరగనున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యేకించి నగరంలో గట్టి పట్టున్న టీడీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టీ టీడీపీ నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. తాజాగా నిన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పార్టీ గ్రేటర్ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘ మంతనాలు సాగించిన ఆయన పార్టీ నినాదాన్ని కూడా ఖరారు చేశారు. ‘షహర్ హమారా... హైదరాబాదు హమారా’ అన్న నినాదంతో ముందుకెళ్లాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.