: పోలీసు చక్రబంధంలో పాటియాలా కోర్టు... షాపులు మూత, 16 సీసీ కెమెరాల ఏర్పాటు
దేశ రాజధాని ఢిల్లీలోని పాటియాలా కోర్టు పరిసరాల్లో మునుపెన్నడూ లేనంత భద్రత అమల్లోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మోతీలాల్ ఓరా లాంటి సీనియర్లు కోర్టుకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో కలిసి వారు కోర్టు ప్రాంగణానికి ర్యాలీగా వస్తారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించిన ఉన్నతాధికారులు పాటియాలా కోర్టు పరిసరాల్లోని దుకాణాలన్నింటినీ మూసి వేయించారు. ఇక కోర్టు ఆవరణలో ప్రతి సన్నివేశాన్ని రికార్డు చేసే క్రమంలో మొత్తం 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం పాటియాలా కోర్టు ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తొలిసారిగా కోర్టు మెట్లెక్కనున్న సోనియా, రాహుల్ లు అరెస్ట్ కు కూడా వెనుకాడకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో అల్లర్లు చోటుచేసుకునే ప్రమాదముందన్న భావనతోనే పోలీసులు భారీ భద్రత కల్పించారు.