: ర్యాడో వాచీలు, ఐఫోన్లు, జానీవాకర్ విస్కీ బాటిళ్లు... కన్నడ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఓటర్లకు తాయిలాలు!
స్థానిక సంస్థల కోటా కింద కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో వింతలూ, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. ఓట్ల కోసం బరిలోకి దిగుతున్న అభ్యర్థులు నిన్నటిదాకా బంగారు ఉంగరాలు, పట్టు చీరలు పంపిణీ చేసేవారు. తాజాగా వాటి స్థానాన్ని ఖరీదైన ర్యాడో వాచీలు, ఐఫోన్లు ఆక్రమించేశాయి. ప్రపంచ ప్రసిద్ధ మద్యం బ్రాండు జానీ వాకర్ బాటిళ్లు కూడా గిఫ్ట్ ల జాబితాలోకి చేరిపోయాయి. ప్రస్తుతం కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అయిన 25 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈ నెల 27న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం హోరెత్తుతోంది. ఒక్కో నియోజకవర్గంలో 700 నుంచి 9,500 దాకా ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేస్తారని భావిస్తున్న ఓటర్లకు లగ్జరీ రిసార్టుల్లో విందులు వినోదాలతో హోరెత్తిస్తున్నారు. విందులతోనే సరిపెట్టకుండా గిఫ్ట్ లను కూడా వారి జేబుల్లో వేస్తున్నారు. ఈ గిఫ్ట్ ల జాబితాను చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానదు. ఓ పార్టీ అభ్యర్థి ఖరీదైన ర్యాడో వాచీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటుండగా, మరో అభ్యర్థి ఐఫోన్ 5 లను ఎర వేశాడట. బల్క్ కొనుగోళ్లే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ర్యాడో వాచీలు రూ.30 వేల చొప్పున, ఐఫోన్ 5 లను రూ.18 వేలకు బల్క్ గా పలువురు కొనేశారని ఆయా ఉత్పత్తుల స్టోర్లు చెబుతున్నాయి. ఇక కాఫీ తోటలకు పేరుగాంచిన కొడగు ప్రాంతం నుంచి బరిలోకి దిగిన ఓ అభ్యర్థి మరో అడుగు ముందుకేశాడు. ప్రపంచ ప్రసిద్ధ మద్యం బ్రాండ్ జానీ వాకర్ కు చెందిన 12 ఇయర్స్ ఓల్డ్ విస్కీ బాటిళ్లను పంపిణీ చేస్తున్నారట.