: ఢిల్లీలో టెన్షన్, టెన్షన్... నేడు ర్యాలీగా కోర్టుకు సోనియా, రాహుల్?


దేశ రాజధాని ఢిల్లీలో నేడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పరిస్థితిని ముందే అంచనా వేసిన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు మరికొంత మంది పార్టీ సీనియర్లు నేడు పాటియాలా కోర్టుకు వెళ్లనున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న వారి పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సోనియా, రాహుల్ లు నేడు పాటియాలా కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. సోనియా, రాహుల్ లు తొలిసారిగా కోర్టు మెట్లెక్కుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నాయి. అయితే పార్టీ కార్యకర్తలెవరూ ఢిల్లీ రావద్దంటూ పిలుపునిచ్చిన పార్టీ అధిష్ఠానం... ఎంపీలు, కాంగ్రెస్ పాలిత సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు నేటి మధ్యాహ్నం ఒంటి గంట కంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వారందరూ వెంటరాగా సోనియా, రాహుల్ లు ర్యాలీగా కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News