: లిఫ్ట్ లో చిక్కుకుపోయిన అఖిలేష్ దంపతులు!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ భవనంలోని ఒక లిఫ్ట్ లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ సుమారు 30 నిమిషాల పాటు చిక్కుకుపోయారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను వారిద్దరూ అక్కడికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రత్యేకంగా ఉపయోగించే నంబర్ వన్ లిఫ్టు ఇది. ఎంతసేపటికి వారు బయటికి రాకపోవడంతో, అక్కడ ఎదురు చూస్తున్న అధికారులు, సీఎం భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. సుమారు 30 నిమిషాల పాటు ప్రయత్నించిన అనంతరం వారు లిఫ్టులో నుంచి బయటకు వచ్చారు. కాగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గ్యాస్ మాస్క్ లు, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటన అనంతరం యూపీ సీఎం అఖిలేష్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ లిఫ్టులో కొద్ది సేపు చిక్కుకుపోయామని, దేవుడి దయ వల్ల, శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డామని పేర్కొన్నారు. అనంతరం మరో ట్వీట్ కూడా చేశారు. అందులో..లిఫ్టు మెయింటెనెన్స్ ఇంచార్జిపై తగిన చర్యలు తీసుకుంటామని అఖిలేష్ తెలిపారు.