: నా ప్రమేయం ఉందని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: బోడే ప్రసాద్
కాల్ మనీ కేసులో తన ప్రమేయం ఉందని తేలితే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష నేతల ఆరోపణలకు సమాధానమిస్తూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలనే ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోందని అన్నారు. తన కుటుంబంతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి విదేశీ మహిళలతో జల్సా చేస్తున్నానని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తాను ఆయనకు స్నేహితుడైనంత మాత్రాన అతని నేరంలో భాగం ఉందని ఆరోపించడం దారుణమని ఆయన చెప్పారు. తన ప్రమేయం ఉందని అంటున్నారని, దీనిపై ప్రత్యేక విచారణ వేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని, అందులో తన తప్పు ఉందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.