: పాక్, చైనాల దూకుడుపై భారత్ సీరియస్!
పాకిస్థాన్ లో కొత్తగా అణు రియాక్టర్లు ఏర్పాటవుతుండటంపై భారత్ సీరియస్ అయింది. చైనా సహకారంతో కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను పాక్ ఏర్పాటు చేసుకుంటోందని, ఈ విషయంలో భారత దేశ ప్రయోజనాలను కాపాడేందుకు, భద్రతను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ పరిశీలిస్తున్నట్టు భారత్ వెల్లడించింది. ఎటువంటి సవాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధమని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. రెండు అణు రియాక్టర్లకు సరిపడా ఇంధనం, మౌలిక వసతులను చైనా అందించిందని తెలిపిన ఆయన, పాక్ లో అణు కార్యకలాపాలు పెరుగుతూ ఉండటం, భారత సెక్యూరిటీకి ముప్పుగా మారే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. పాక్, చైనాల దూకుడు, ఆ రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల గురించి తమకు తెలుసునని అన్నారు. పాకిస్థాన్ లో ఇప్పటికే రెండు రియాక్టర్లు పనిచేస్తుండగా, మరో రెండు రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.