: హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం అద్భుతంగా ఉంది: కేటీఆర్
ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలులో మెట్టుగూడ-నాగోల్ మధ్య ప్రయాణించిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ అనుభూతులను మీడియాతో పంచుకున్నారు. మెట్రో రైలులో ప్రయాణం తనకు అద్భుత అనుభూతినిచ్చిందని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో రైలు రూపుదిద్దుకుందని, ప్రజలను సురక్షితంగా, వేగంగా గమ్యానికి చేర్చడమే మెట్రో వ్యవస్థ లక్ష్యమని తెలిపారు. మెట్రో కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. మెట్రో రైలుతో ప్రయాణ సమయం చాలావరకు తగ్గిపోతుందని మంత్రి తలసాని అన్నారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగర రూపురేఖలే మారిపోతాయని అభిప్రాయపడ్డారు.