: భారం ప్రజలపై పడితే పంచుకునేందుకు మేమున్నాం: పెట్రోలియం మంత్రి


ప్రస్తుతం తిరోగమన దశలో పెట్రోలు ధరలు ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనాలు భారతీయులకు చేరువ కాకపోవడంపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ప్రజల నుంచి ఒకే విధమైన రుసుమును పెట్రోలు, డీజిల్ విషయంలో వసూలు చేయాలన్నది తమ అభిమతమని తెలిపారు. ఇప్పుడు తక్కువగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని, అప్పుడు తాము పెట్రోలుపై ఉన్న ఎక్సైజ్ సుంకాలను తొలగించి, ప్రజల భారాన్ని పంచుకుంటామని వెల్లడించారు. పెరిగే పెట్రోలు ధరలు ఏ స్థాయికి చేరినా, ప్రజలపై ఒకే రకమైన రిలీఫ్ ను అందిస్తామని వివరించారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు బ్యారల్ కు 35 డాలర్లకు పడిపోయి 11 సంవత్సరాల కనిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాలో పెట్రోలు ధరలు తగ్గక పోవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 2014లో బ్యారల్ క్రూడాయిల్ ధర 116 డాలర్లుగా ఉన్నప్పుడు ఇండియాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 73 నుంచి రూ. 75 మధ్య ఉండగా, ధర మూడో వంతుకు పడిపోయినా, లభించిన ప్రయోజనం నామమాత్రం. వాస్తవానికి రూ. 20 కన్నా తక్కువకే లీటరు పెట్రోలు లభించాల్సి వుండగా, ఓ వైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా ఎక్సైజ్ సుంకాలను పెంచుతున్నాయని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News