: చిత్ర రూపంలో కొలువుదీరిన చంద్రబాబు 18 నెలల పాలనా ప్రస్థానం
ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని గొడ్డేటి బాలు అనే చిత్రకారుడు చిత్రాల రూపంలో చాటుకున్నారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలన ప్రస్థానాన్ని అందమైన చిత్రాలుగా మలచారు. రాష్ట్రంలో సీఎం నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ చిత్రకారులు గొడ్డేటి బాలు, గొడ్డేటి రమలు 'జెల్ పెన్' శైలి చిత్రకళా ప్రదర్శనను హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 250 చిత్రాలు ఉంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన పథకాలు, సమావేశాల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. పోలీస్, లాయర్, డాక్టర్ రూపాల్లో కనిపించిన చంద్రబాబు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. జనచైతన్య యాత్ర సమయంలో ఆయన హావభావాలను కూడా చిత్రీకరించారు. 18 నెలల చంద్రబాబు పాలన తెలుసుకోవాలంటే ఈ చిత్రాలను చూడాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిషోర్ బాబు, పొట్లూరి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు విజయభాస్కర్ లు పాల్గొన్నారు.