: మొదట 'కిడ్నాపర్' అని చెప్పి, ఆపై ప్రియుడేనని మొర పెట్టుకున్న డ్యాన్సర్!


తనను ఓ వ్యక్తి కిడ్నాప్ చేస్తున్నాడని గగ్గోలు పెట్టిన ఓ యువతి, పోలీసుల రంగ ప్రవేశంతో సాయంత్రానికి అతను తన ప్రియుడేనని చెప్పి విడిచి పెట్టాలని ప్రాధేయపడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా హైదరాబాద్ లో డ్యాన్సర్ గా పనిచేస్తోంది. ఆమెకు ప్రోగ్రాములు తెచ్చి పెట్టే ఆర్గనైజర్ తో గొడవ వచ్చి గుంటూరులోని బంధువుల ఇంటికి నివాసాన్ని మార్చింది. ఈ క్రమంలో నిన్న ఓ యువకుడి బైకుపై బైపాస్ రోడ్డు వరకూ వచ్చి అక్కడో సీన్ క్రియేట్ చేసింది. ఆ యువకుడు తనను కిడ్నాప్ చేసి తెస్తున్నాడని హడావుడి చేసింది. అదే దారిలో వెళుతున్న విజయవాడ సీఐ దీన్ని చూసి ఇద్దరినీ తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. తొలుత అతనెవరో తెలియదనే చెప్పిందా యువతి. అతడు మాత్రం తాము భార్యాభర్తలమని అంటుండటంతో, యువతి తండ్రికి పోలీసులు కబురు చేశారు. ఆపై కాసేపటికి తమది ఒకే ఊరని, ప్రేమించుకుంటున్నామని, తనతో గొడవ పడుతుంటే, భరించలేక అతను కిడ్నాప్ చేస్తున్నాడని చెప్పానని తప్పు ఒప్పుకుంది. అతన్ని వదిలేయాలని వేడుకుంది. పోలీసులు ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి తల్లిదండ్రులు వచ్చిన తరువాత పంపుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News