: అసలు ఏపీలో జరుగుతున్న 'కాల్ మనీ సెక్స్ రాకెట్' ఏంటంటే..!
ఆంధ్రప్రదేశ్ లో కాల్ మనీ సెక్స్ రాకెట్ బహిర్గతమైన నాటి నుంచి రాజకీయ ప్రకంపనలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ రాకెట్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని తొలుత వార్తలు రాగా, ఆపై అన్ని పార్టీల వారికీ ఈ మకిలి అంటుకుందని తెలుస్తోంది. అసలు కాల్ మనీ అంటే ఏంటి? తన దైనందిన అవసరాలు, హఠాత్తుగా వచ్చి పడే ఖర్చులను తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారి అవసరాలను అలుసుగా తీసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చే వ్యవస్థే కాల్ మనీ. తనకు డబ్బు కావాలని అడిగిన వారి నుంచి తేదీ వేయని ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుని అప్పులిస్తారు. (ప్రాంసరీ నోటుపై తేదీ వేస్తే రెండేళ్ల వరకు, చెక్కుపై తేదీ వేస్తే 3 నెలలు మాత్రమే చెల్లుతాయి కాబట్టి). ఆపై వారి నుంచి వడ్డీలు సక్రమంగా వసూలు చేయడమే వీరి పని. అసలును గురించి పట్టించుకోరు. కాల్ మనీ సెక్స్ రాకెట్: ఇక అప్పులు తీసుకుని సమయానికి వడ్డీలు కట్టలేకపోతున్న వారిపై అప్పిచ్చిన బడా బాబులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. తొలుత వారి ఇళ్లకు రౌడీలను పంపి బెదిరిస్తారు. ఆపై వారి వద్ద ఆస్తుల తాలూకు పత్రాలుంటే తీసుకెళ్తారు. డబ్బిచ్చేదాకా ఆస్తులను తమ అధీనంలోనే ఉంచుకుంటారు. సమయానికి డబ్బు చెల్లించని వారి వద్ద ఇంతకుమించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారు నడుపుతున్నదే సెక్స్ రాకెట్. తీసుకున్న డబ్బు ఎంతయినా, కట్టిన వడ్డీ లెక్క ప్రకారం, అది చెల్లించాల్సిన మొత్తాన్ని మూడు నాలుగింతలు పెంచిన తరువాత, ఈ ముఠా రంగంలోకి దిగుతుంది. ఎలాగైనా డబ్బు చెల్లించాలని బెదిరిస్తుంది. అందుకు హేయమైన ఆ మార్గాన్ని సూచిస్తుంది. వీరి ఒత్తిడికి తట్టుకోలేక వందలాది మంది మహిళలు ఈ రాకెట్ లో భాగం అయినట్టు ఇప్పుడు పోలీసులు గుర్తిస్తున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాల్ మనీ వ్యాపారి వద్ద రూ. 1.5 లక్షలు తీసుకున్న అసలుకు, వడ్డీ రూ. 6 లక్షలకు చేరడంతో ఓ మహిళపై ఇదే వల విసిరారు. ఆమె తన స్మార్ట్ ఫోన్లో కామాంతకుల మాటలను రికార్డు చేసి పోలీసుల ముందు పెట్టడంతో నమోదైన కేసు ఫలితమే, వెలుగులోకి వచ్చిన ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్. తీగ లాగేకొద్దీ కదులుతున్న ఈ డొంక వెనుక కొండలే ఉన్నాయో? పర్వతాలే ఉన్నాయో?!