: ‘కాల్ మనీ’తో కష్టాల్లో చంద్రబాబు!... నేషనల్ మీడియా ఆసక్తికర కథనం
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ దందా సమస్యతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిక్కుల్లో పడ్డారట. విపక్షం డిమాండ్లకు తలొగ్గిన చంద్రబాబు ఈ దందాపై న్యాయవిచారణకు ఆదేశించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు నేషనల్ న్యూస్ పోర్టల్ ‘జీ న్యూస్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ఇళ్లు, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని సింగిల్ ఫోన్ కాల్ తో రుణాలిచ్చేసిన కాల్ మనీ రాకెట్ వసూళ్లలో బరి తెగించిన వైనం పైనా ఆ కథనం సవివరంగా తెలిపింది. రుణ వసూళ్లలో కఠినంగా వ్యవహరించిన కాల్ మనీ నిర్వాహకులు మహిళలను వ్యభిచార కూపంలోకి లాగేశారని, ఈ దందాకు రాజకీయ నేతల మద్దతు కూడా ఉందని పేర్కొంది. ప్రధానంగా అధికార టీడీపీకి చెందిన పలువురు నేతలకు ఈ దందాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో విపక్షం విరుచుకుపడింది. దీంతో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయక తప్పలేదని ఆ కథనం పేర్కొంది.