: 'రోబో' సీక్వెల్ లో సైంటిస్ట్ వశీకర్ సహాయకులుగా 'డ్వార్వ్'లు!
రజనీకాంత్, శంకర్ ల సూపర్ హిట్ కాంబినేషన్ కు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేరికతో మరింత క్రేజు పెరగగా, రోబో సీక్వెల్ చిత్రం నిన్న చెన్నైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. చెన్నై శివారులో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ ప్రారంభం కాగా, సైంటిస్టు వశీకర్ (రజనీకాంత్) ల్యాబ్ లో పరిశోధనలు సాగిస్తున్న దృశ్యాల చిత్రీకరణ జరిగింది. ఆ చుట్టుపక్కలా ఎన్నో చిన్న, చిన్న రోబోలు ఉన్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, రజనీకాంత్ పక్కన 'డ్వార్వ్'లు ఉన్నారు (డ్వార్వ్ అంటే తెలుసుగా... ఆంగ్ల రచయిత జేఆర్ఆర్ టాల్కిన్ తన ఫ్యాంటసీ, ఫిక్షన్ పుస్తకాల కోసం పుట్టించిన పదం. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హాబిట్ తదితర సినిమాల్లో చిత్ర విచిత్రంగా కనిపించే పోరాటయోధులు). మన సైంటిస్టు వశీకర్ కు ల్యాబ్ లో సహాయకులుగా వీరిని వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇక శంకర్ వీరితో తనదైన శైలిలో కామెడీ చేయిస్తారని భావించవచ్చేమో! షూటింగ్ రాత్రి 7 గంటల వరకూ జరుగగా, చిత్రంలో విలన్ పాత్రను పోషించనున్న అక్షయ్ కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు సెట్ కు వచ్చి కాసేపు గడిపి వెళ్లారు.