: రేపు స్టేషనుకు రాకుంటే ఇక అరెస్టే!: శింబుకు పోలీసుల హెచ్చరిక
తమిళ హీరో శింబుకు కోవై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను అవమానిస్తూ ఆయన పాడిన పాటపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణకు సహకరించాలని, స్టేషనుకు రావాలని ఇప్పటికే పలుమార్లు కోరగా, శింబు వాటిని పట్టించుకోకపోవడంతో సీరియస్ అయ్యారు. స్థానిక పోలీసు కమిషనర్ అమల్ రాజ్ ఆదేశాలతో గత మూడు రోజులుగా శింబు కోసం పోలీసులు చెన్నైలో వెతికినా ఆయన జాడ తెలియరాలేదు. దీంతో వారింటికి సమన్లు పంపి, 19న స్టేషనుకు రావాలని కోరారు. ఇక రేపు శింబు స్టేషనుకు రాకుంటే, ఆయన్ను అరెస్ట్ చేయక తప్పదని, ఆపై కోర్టులో హాజరు పరచాల్సి వుంటుందని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరి పిటిషన్లు నేడు కోర్టు ముందుకు రానున్నాయని సమాచారం.