: అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన జగన్... పాదయాత్రగా అసెంబ్లీకి పయనం
కాల్ మనీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదు, లోటస్ పాండ్ లోని తన ఇంటి నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్ కు చేరుకున్న ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చను తప్పించుకునేందుకు నిన్నటి సమావేశాల్లో ప్రభుత్వం అంబేద్కర్ పేరును ప్రస్తావించిందని జగన్ విరుచుకుపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో పాత్ర ఉన్న టీడీపీ నేతలను కాపాడుకునేందుకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తామని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు.