: వీణా-వాణిలను పరిశీలించిన ఎయిమ్స్ బృందం... ఆపరేషన్ సాధ్యమేనని ప్రకటన
అవిభక్త కవలలు వీణా-వాణిలకు ఆపరేషన్ సాధ్యమవుతుందని ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు న్యూరోసర్జన్ల బృందం తెలిపింది. త్వరలో వారిని ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకువెళతామని, మరింత అధ్యయనం చేశాకే వారిద్దరికీ ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పింది. ఆపరేషన్ క్లిష్టతరమైనప్పటికీ ఎలాంటి ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి వచ్చిన వైద్యుల బృందం వీణా-వాణిల ఆపరేషన్ కు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై పరిశీలన చేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ వివరాలను తెలిపింది. వారిద్దరి ఆపరేషన్ పై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. గతంలోనే వారిద్దరిని ఆపరేషన్ ద్వారా వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం ఆపరేషన్ విషయాన్ని ఎయిమ్స్ కు అప్పగించింది. లండన్ వైద్యులను ఢిల్లీకి తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖర్చుపై స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కు లేఖ రాసింది. దాంతో రూ.10 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అంతేగాక ఆపరేషన్ కు 10 నెలల సమయం పడుతుందని అప్పటివరకు తమ పర్యవేక్షణలోనే చిన్నారులు ఉంటారని చెప్పారు.