: మరింత డబ్బు ఆదా చేసే ఐదు సులువైన మార్గాలివి!


మానవ జీవితంలో డబ్బుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ఎంత ఎక్కువగా డబ్బు కూడబెట్టుకుని ఉంటే అంత ఆనందంగా, సౌకర్యవంతంగా జీవనాన్ని గడపవచ్చు. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు వచ్చి చేరుతుందనుకోవడం అత్యాసే. అందువల్లే చిన్న చిన్న మొత్తాల రూపంలో పొదుపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో డబ్బును మరింతగా ఆదా చేసేందుకు ఓ ఐదు మార్గాలు. 1. షాపింగ్ జాబితా - క్రెడిట్ కార్డు: ఏదైనా షాపింగ్ చేయాలని భావించినప్పుడు, ఏం కొనాలని భావిస్తున్నారో ముందుగానే ఓ అంచనాకు రావాలి. క్రెడిట్ కార్డులు, గిఫ్ట్ సర్టిఫికెట్లు వాడుతూ షాపింగ్ చేసే సమయంలో తెలియకుండానే పెద్దగా ఉపయోగపడని వస్తువులను కొనుగోలు చేస్తుంటారని, ఈ పద్ధతి కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డులను వాడకుండా ఉంటే మీ జేబులో ఎంతో కొంత మిగులుతుంది. కార్డులపై కొనుగోళ్లు చేయడం ఆపితే, వాటికి కట్టే వడ్డీని మిగుల్చుకోవచ్చు. 2. రివార్డు పాయింట్లు: ప్రస్తుతం ఏ కార్డు వాడినా, ఏ వెబ్ సైట్ లో షాపింగ్ చేసినా రివార్డు పాయింట్లు లభిస్తున్నాయి. వీటిని రిడీమ్ చేసుకోవడం మరువకూడదు. దానివల్ల ఏదో ఒక వస్తువు ఉచితంగా వచ్చినట్లవుతుంది. 3. ఫిట్ నెస్: ఓ జిమ్ మెంబర్ షిప్ ను తీసుకునే బదులు తేలికపాటి వ్యాయామాలతోను, నడకతోను బోలెడంత కొవ్వును కరిగించుకోవచ్చు. ఇంకా అవసరమనుకుంటే వ్యాయామ శిక్షణా కేంద్రంలో ఓ నెల రోజులు చేరి, ఆపై ఇంట్లోనే దాన్ని కొనసాగించవచ్చు. తద్వారా 11 నెలల జిమ్ ఫీజు మిగులుతుంది. 4. కాలక్షేపానికి ఎన్నో ఈవెంట్లు: డబ్బు ఖర్చు పెట్టే వినోదాన్ని వెతుక్కోనక్కర్లేదు. మీ చుట్టుపక్కలా ఎంతమాత్రమూ ఖర్చు కాకుండా కావాల్సినంత వినోదాన్నిచ్చే పార్టీలు బోలెడు జరుగుతుంటాయి. అయితే, అవి ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయన్నది తెలుసుకుంటే చాలు. 5. ఒక్క పది రూపాయలు చాలు: మీ అన్ని సేవింగ్స్, పెట్టుబడుల అలవాట్లన్నీ పక్కనబెట్టండి. రోజుకు ఒక్క 10 రూపాయలు దాచండి. సంవత్సరం చివరకు అది ఏదో ఒక అవసరాన్ని తీరుస్తుంది. మీరు ఇంకా ఎక్కువగా దాచగలరా? మరింత మంచిది. మీ ఆర్థిక స్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఇవే కాదు... డబ్బు దాచుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా, క్రమానుగుణంగా పొదుపు చేస్తూ వెళితే, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు.

  • Loading...

More Telugu News