: బిగ్ బీ కొనసాగుతున్నారు..ధర్మేంద్ర ఆగిపోయారు!


నాటి రొమాంటిక్ హీరో, బాలీవుడ్ హీ-మ్యాన్, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత ధర్మేంద్ర ఇటీవలే ఎనభైఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1960లో 'దిల్ భి తేరా హమ్ భి తేరే' చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. కాగా, బాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ సినీ రంగ ప్రస్థానం 1969లో 'సాత్ హిందూస్థానీ' చిత్రంతో మొదలైంది. ఈ అగ్రహీరోలిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలు నటించారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు. గమ్మత్తేమిటంటే.. బిగ్ బీ తన నట ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తుండగా, ధర్మేంద్ర మాత్రం ప్రస్తుతం దూరంగా ఉన్నారు. అయితే.. ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ధర్మేంద్ర నటజీవితానికి సంబంధించిన విశేషాలు గురించి చెప్పాలంటే.. పంజాబ్ లోని లుధియానాకు చెందిన ధర్మేంద్ర బాలీవుడ్ లోని అందరి హీరోయిన్ల సరసన నటించాడు. నూతన్, నందా, మీనాకుమారి వంటి ఇతర తారలతో నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ధర్మేంద్రను హీ-మ్యాన్ అని అభిమానులు పిలుచుకోవడానికి కారణం ఆయన నటించిన రొమాంటిక్ చిత్రాలే. 1961 నుంచి 1967 వరకు సుమారు ఆరేళ్ల పాటు ఆయన నటించిన చిత్రాలన్నీ రొమాంటిక్ కథాంశాలతో కూడినవే. 1975 నాటికి ఆయన పలు విభిన్న పాత్రల్లో నటించి, తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. 1980వ దశకంలో ధర్మేద్ర కెరీర్ మలుపు తిరిగింది. యాక్షన్ కథాంశాలను ఆయన ఎంచుకున్నారు. సూరత్ అవుర్ సీరత్, బందిని, దిల్ నే ఫిర్ యాద్ కియా, బహారె ఫిర్ భి ఆయేంగీ, ఆకాష్ దీప్, మై భి లడ్కి హూ చిత్రాలు, ధరమ్ వీర్, ఆజాద్ వంటి యాక్షన్ సినిమాల్లోనూ ఆయన నటన ప్రేక్షకుల మన్ననలు పొందింది. సుమారు నలభై సంవత్సరాల క్రితం విడుదలైన 'షోలే'లో ధర్మేంద్ర నటన ఎన్ని ప్రశంసలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటి 'డ్రీం గాళ్' హేమమాలినిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారి సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ లు కూడా బాలీవుడ్ నటులే. కాలక్రమంలో రాజకీయాల వైపు మొగ్గు చూపిన ధర్మేంద్ర బీజేపీ అభ్యర్థిగా రాజస్థాన్ లోని బికనీర్ నుంచి పోటీ చేసి 14వ లోక్ సభకు ఎన్నికయ్యారు. బాలీవుడ్ లో అడుగుపెట్టగానే ఫిలింఫేర్ వారి న్యూ టాలెంట్ అవార్డును గెలుచుకున్న ధర్మేంద్రకు.. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

  • Loading...

More Telugu News