: రిస్క్ తీసుకుంటేనే మరో మెట్టెక్కుతారు: విద్యార్థులతో సుందర్ పిచాయ్
నేటి తరం యువతకు చదువుతోపాటు వినూత్న ఆలోచనలు, వాటిని అమలు చేసేందుకు తగినంత రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలని గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో చదువు కంటే సృజనాత్మకతే ముఖ్యమని తెలిపిన ఆయన, రిస్క్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినా, అవి తాత్కాలికమేనని, ఆ వెంటనే విజయం కూడా వస్తుందని అన్నారు. న్యూఢిల్లీలో ఓ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, ఉద్యోగాలు పొందడం గురించి కాకుండా, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న కోరికతో విద్యార్థులు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం తనకు సిలికాన్ వ్యాలీకి, ఢిల్లీకి పెద్దగా తేడా కనిపించడం లేదని, డెవలపర్ల సంఖ్య ఎంత పెరిగితే, సమస్యలకు అన్ని పరిష్కారాలు లభిస్తాయని సుందర్ వివరించారు.