: ఒక్కరోజు ప్రతిపాదిస్తే... రెండు రోజులు సస్పెండ్ చేయడం విడ్డూరం: స్పీకర్ పై జగన్ విసుర్లు
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రామలింగేశ్వర రావు అలియాస్ రాజా (తుని), శివప్రసాదరెడ్డి (ప్రొద్దుటూరు)లను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకునేలా వీడియో కెమెరాలకు వారిద్దరూ అడ్డంగా నిలబడ్డారు. కెమెరాలకు అడ్డు తొలగమని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని వారిద్దరూ పెడచెవిన పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఇది మంచి పద్ధతి కాదని కాస్తంత గట్టిగానే మందలించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వారిద్దరినీ ఒక రోజు సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. అయితే సభ్యులతో మూజువాణి ఓటింగ్ తీసుకున్న స్పీకర్ కోడెల సదరు ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. సభ వాయిదా పడ్డ తర్వాత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులను ఒక్కరోజు సస్సెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే, స్పీకర్ రెండు రోజుల పాటు సస్సెండ్ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.