: కాల్ మనీకి కడప మహిళ బలి... వేధింపులతో కోమాలోకి వెళ్లిన మహిళ, అనంతరం మృత్యువాత
కాల్ మనీ దందా దారుణాలకు అంతే లేకుండా పోతోంది. ఇప్పటికే విజయవాడలో కాల్ మనీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్న పలువురు మహిళలు వ్యభిచార కూపంలోకి దిగిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తమపై కాల్ మనీ వ్యాపారులు అత్యాచారాలు చేయడం, ఆ సందర్భంగా వారు రికార్డు చేస్తున్న అశ్లీల చిత్రాల కారణంగా చచ్చినట్లు వ్యభిచార కూపంలోకి దిగాల్సి వచ్చిందని పలువురు మహిళలు పోలీసుల ముందు బావురుమన్నారు. తాజాగా కడప జిల్లాలో కాల్ మనీ దందాకు ఓ మహిళ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. కడపలోని హజారీ వీధికి చెందిన వహీదా భాను నగరానికి చెందిన ఆల్ ఫ్రెడ్ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇల్లు తనఖా పెట్టి రూ.1.20 లక్షలు అప్పు తీసుకుంది. బాకీ చెల్లింపులో కాస్తంత జాప్యం జరగడంతో ఇంటిని లాగేసుకున్న ఆల్ ఫ్రెడ్, వహీదాపై వసూళ్లను రాబట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక ఆ షాక్ తో వహీదా కోమాలోకి వెళ్లిపోయింది. తాజాగా నేటి ఉదయం కన్నుమూసింది. ఆల్ ఫ్రెడ్ వేధింపుల కారణంగానే వహీదా చనిపోయిందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.