: నారా లోకేశ్ అనుచరుడే ‘కాల్ మనీ’ ప్రధాన నిందితుడు: వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణ
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితం టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాల్ మనీ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబట్టినా, స్పీకర్ అనుమతించలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం రేపు ప్రకటన చేయనుందని చెప్పిన స్పీకర్ నేడు చర్చకు ససేమిరా అన్నారు. దీంతో సభా కార్యక్రమాలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. సభ వాయిదా పడ్డ అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా టీడీపీపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు సంధించారు. కాల్ మనీ దందాలో ప్రధాన నిందితుడు నారా లోకేశ్ అనుచరుడేనని ఆమె ఆరోపించారు. ఈ కారణంగా టీడీపీ సర్కారు చర్చకు వెనుకాడుతోందని ఆమె ధ్వజమెత్తారు.