: వాయిదాల పర్వం... 2 గంటల వ్యవధిలోనే ఏపీ అసెంబ్లీ రెండు సార్లు వాయిదా


ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు ఏమాత్రం మారలేదు. మునుపటి సమావేశాల మాదిరిగానే శీతాకాల సమావేశాలు నడుస్తున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే పలు అంశాలపై చర్చకు విపక్షం పట్టు, అధికార పక్షం అడ్డగింపులతో గత సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగింది. తాజాగా నేటి ఉదయం ప్రారంభమైన సమావేశాలు కూడా వాయిదాలతోనే నడుస్తున్నాయి. సభ ప్రారంభం కాగానే కాల్ మనీ వ్యవహారంపై చర్చకు విపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాల హోరు వినిపించారు. ఈ సమయంలో అధికార పక్షం కూడా ప్రతిదాడికి దిగింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సింగిల్ అంశంపై చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ విపక్షం తన పట్టు వీడలేదు. అధికార పక్షమూ వెనక్కు తగ్గలేదు. కాల్ మనీపై రేపటి సమావేశాల్లో ప్రకటన చేస్తామని చెప్పినా, విపక్షం వినకపోవడం విడ్డూరంగా ఉందని నిందించింది. దీంతో మరోమారు సభలో గందరగోళం నెలకొంది. అరుపులు, కేకలతో నిండిన సభను స్పీకర్ మరోమారు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరసి సభ ప్రారంభమై రెండు గంటలు కూడా గడవకముందే రెండు సార్లు వాయిదా పడిపోయింది.

  • Loading...

More Telugu News