: ఇండియా వేరు, పాకిస్థాన్ వేరు: అమెరికా
తమ దృష్టిలో ఇండియా వేరు, పాకిస్థాన్ వేరని అమెరికా స్పష్టం చేసింది. ఇండియాతో కుదుర్చుకున్నటువంటి అణు ఒప్పందాన్ని పాక్ తో కుదుర్చుకునే సమస్యే లేదని పేర్కొంది. "పాక్ తో '123' అణు ఒప్పందం గురించి మేము చర్చించడం లేదు" అని పాక్, ఆప్ఘనిస్థాన్ లలో యూఎస్ ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓల్సన్ తెలిపారు. షార్ట్ రేంజ్ న్యూక్లియర్ వెపన్స్ కోసం పాక్ ప్రస్తావించినప్పటికీ, తాను తోసిపుచ్చినట్టు తెలిపారు. తమ దేశంలో ఉన్న తీవ్రవాదం, జాతీయ భద్రత తదితర అంశాలపై పాక్ కు పూర్తి అవగాహన ఉందని ఓల్సన్ వివరించారు. పాకిస్థాన్ ఇకపై అణ్వాయుధాలను సమకూర్చుకోవద్దని కూడా సలహా ఇచ్చామని, క్షిపణుల అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా కోరామని తెలిపారు. ఆ దేశంలో అణు రక్షణ అంత సులువు కాదన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.