: రోడ్లపై తిరుగుతున్నారుగా... కట్టాల్సిందే: పెట్రోలు ధరలపై జైట్లీ విచిత్ర వాదన!
ఇంటర్నేషనల్ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల కనిష్ఠానికి దిగజారిన వేళ, ఆ స్థాయి ప్రయోజనం ఇండియాలోని వాహనదారులకు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వస్తున్న విమర్శలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. "పెట్రోలుపై వసూలు చేస్తున్న సుంకాల వల్లే ధర ఎక్కువగా ఉంది. ఈ సుంకాల్లో 42 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకే వెళుతోంది. కేంద్రానికి వచ్చే నిధులను జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి వెచ్చిస్తున్నాం. పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసి ఈ రోడ్లపైనే తిరుగుతున్న ప్రజలు తప్పనిసరిగా అదనపు రుసుము చెల్లించాల్సిందే" అని అన్నారు. గతంలో 80 డాలర్ల వద్ద ముడి చమురు ఉన్నప్పుడు చమురు కంపెనీలకు రూ. 40 వేల కోట్ల నష్టాలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, అప్పుడు ఆ భారాన్ని కేంద్రం భరించిందని గుర్తు చేశారు. జైట్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రపంచంలో పెట్రోలుకు ఇంత ఎక్కువ ధర ఉన్నది ఇండియాలోనేనని అంటున్నారు. ఇక రోడ్లు మిగతా దేశాలకన్నా అద్భుతంగా ఎప్పుడు చేస్తారని ఒకరు ప్రశ్నిస్తే, మన రోడ్లు అంత బాగుచేస్తున్నారా? ఒక్కసారి మా ఊరు వచ్చి చూడండి అని ఇంకొకరు, రోడ్లే బాగుంటే సగం ప్రమాదాలు తగ్గుతాయని మరొకరు వ్యాఖ్యానించారు.