: సున్నా శాతం వడ్డీకి అమెరికా మంగళం - 35 డాలర్లకు పడిపోయిన క్రూడాయిల్
జూన్ 2006 తరువాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం తొలి ప్రభావం క్రూడాయిల్ మార్కెట్ పై పడింది. జనవరిలో డెలివరీ అయ్యే లైట్ స్వీట్ క్రూడాయిల్ ధర బ్యారలుకు క్రితం ముగింపుతో పోలిస్తే 1.83 డాలర్లు పడిపోయి 4.9 శాతం పతనంతో 35.52 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 2009 తరువాత క్రూడాయిల్ కు పలికిన అతి తక్కువ ధర ఇదే. ఇక కాస్తంత నాణ్యత అధికంగా ఉండే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.26 డాలర్లు తగ్గి 3.3 శాతం పతనంతో 37.19 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ క్రూడాయిల్ విషయంలో ఈ ధర డిసెంబర్ 2008 తరువాత కనిష్ఠం. మొత్తం మీద గడచిన సంవత్సరం వ్యవధిలో క్రూడాయిల్ ధర 30 శాతానికి పైగా పడిపోయింది. కాగా, యూఎస్ కమర్షియల్ క్రూడ్ విభాగం కొత్త చమురు క్షేత్రాలను కనుగొన్నట్టు వెలువడిన వార్తలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించి వేశాయని నిపుణులు వ్యాఖ్యానించారు.