: జపాన్ ప్రధాని షింజో అబే మనసు కరిగిన వేళ!
జపాన్ ప్రధాని షింజో అబే... గత వారంలో ఇండియాకు వచ్చి, పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్లిన జపాన్ ప్రధాని. ఆయన పర్యటనలో జరిగిన ఓ ఘటన ఆయన్ను కదిలించి వేసింది. తన కాన్వాయ్ లో, తనకు రక్షణగా ప్రయాణిస్తున్న ఓ భారత కానిస్టేబుల్ చనిపోయాడని తెలుసుకున్న ఆయన మనసు చలించింది. ఈ నెల 13న ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అబే ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో బైక్ నడుపుతున్న వీరేందర్ సింగ్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం ఆనాడు షింజోకు తెలియలేదు. జపాన్ తిరిగి వెళ్లిన తరువాత విషయాన్ని తెలుసుకున్న ఆయన, వీరేందర్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఓ పూల బొకేను పంపించారు. దీన్ని భారత జపాన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు వీరేందర్ కుటుంబ సభ్యులకు అందించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, పాలెం పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న వీరేందర్ కు గత ఆదివారం నాడు షింజో కాన్వాయ్ డ్యూటీ పడింది. తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ ముందు బైక్ పై వెళుతున్న వీరేందర్ ను మెట్రో పిల్లర్ 139 వద్ద ఓ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మరణించారు. కాన్వాయ్ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలూ కలుగనీయకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, షింజోకు విషయం తెలిసి స్పందించారు.