: 1,500 మంది పూజారులు, 150 మంది వంట మనుషులు... కేసీఆర్ చండీయాగంపై ఎన్డీటీవీ కథనం
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 23 నుంచి 27 దాకా నిర్వహించనున్న అయుత చండీయాగంపై నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో కేసీఆర్ చేపట్టనున్న ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ ఏర్పాట్లపై ప్రముఖ ఆంగ్ల చానెల్ ‘ఎన్డీటీవీ’ తన ఆన్ లైన్ వెబ్ సైట్ లో సమగ్ర కథనాన్ని పోస్ట్ చేసింది. 1,500 మంది పూజారులతో ఐదు రోజుల పాటు జరగనున్న ఈ యాగానికి సుమారు 50 వేల మంది రానున్నారని, వీరి భోజన ఏర్పాట్ల కోసం 150 మంది వంట మనుషులతో భారీ ఏర్పాట్లు చేసిందని ఆ కథనం పేర్కొంది. ఇక ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలు రాష్ట్రాల గవర్నర్లతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వంటి ప్రముఖులను ఆహ్వానించినట్టు ఆ కథనం ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడకు వెళ్లిన విషయాన్ని కూడా ఆ కథనం ప్రత్యేకంగా పేర్కొంది.